మహిళల విద్యాభివృద్ధికి కృషి
నాగర్‌కర్నూల్: మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని, ఆమె స్ఫూర్తిని నేటితరం మహిళా ఉపాధ్యాయిణులు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్ బదావత్ సంతోష్, డీఈఓ రమేష్‌కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారని కొనియాడారు. అస్పశ్యత, అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. అనంతరం జిల్లాలోని 15 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వారిని సత్కరించారు.


