అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి
నాగర్‌కర్నూల్: వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా తెలుసుకున్నారు. ప్రతి అభివృద్ధి పనికి సంబంధించి ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, పూర్తయ్యే గడువు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టిసారించి, ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. నూతనంగా మంజూరైన అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలన్నారు. టెండర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయకుండా జాప్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి శాఖ అధికారి తమ పరిధిలోని పనులపై సమగ్ర నివేదికలు సమర్పించాలన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని.. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, అన్నిశాఖల సమన్వయంతో నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అభివద్ధి పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీపీఓ శ్రీరాములు, డీఈఓ రమేశ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఈ విజయ్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్ ఉన్నారు.


