వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
పెద్దకొత్తపల్లి: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ సూచించారు. శుక్రవారం పెద్దకొత్తపల్లి పీహెచ్‌సీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో ప్రబలే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ వెంట పీహెచ్‌సీ డాక్టర్ నారాయణస్వామి, నరేంద్రనాథ్, శ్రీనివాస్, సంపత్‌కుమార్, సిబ్బంది భాగ్యమ్మ, నాగమణి, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.


