
ఉద్యమ నేతకు జోహార్లు
సొంతూరిపై మమకారం..
● స్వగ్రామం కంచుపాడులో సురవరం సుధాకర్‌రెడ్డికి ఘనంగా నివాళి
● నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న గ్రామస్తులు
●
సురవరం జీవనం నిరాడంబరంగా సాగింది. పార్టీలో జాతీయస్థాయి పదవితో పాటు ఎంపీగా రెండు పర్యాయలు సేవలందించారు. కానీ సొంతూరికి వచ్చిన సమయాల్లో ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఇంటి వద్ద బయట కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. గ్రామ వీధుల్లో సైతం సాదాసీదాగా తిరుగుతూ అందరిని పలుకరించేవారు.
అలంపూర్/ఉండవెల్లి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి (83) మృతితో ఆయన స్వగ్రామం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకొని బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమై శ్రద్ధాంజలి ఘటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. మారుముల గ్రామం నుంచి జాతీయ నేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం గురించి చర్చించారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.
జాతీయ రాజకీయాలను శాసించిన సురవరానికి సొంతూరిపై మమకారం ఎక్కువ. సీపీఐ అగ్రనేతగా ఉన్న సమయంలోనూ తరుచూ వచ్చి వెళ్లేవారు. తండ్రి సురవరం వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రం నెలకొల్పి యువతులు, మహిళలకు కుట్టు శిక్షణ, యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించారు. అలాగే ఏటా సంక్రాంతికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఐసోలేషన్ కిట్స్, నిత్యావసర సరుకులు అందించి ఆసరాగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. సీపీఐ మహాసభలు, యువజన ఉత్సవాలు సురవరం విజ్ఞాన కేంద్రంలోనే నిర్వహించి సొంతూరిపై అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రిని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తూనే సొంత ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకును నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులను ప్రోత్సహించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించారు.

ఉద్యమ నేతకు జోహార్లు