
పోలీసుల సంక్షేమానికి కృషి : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్‌ఐ స్టోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్‌ఐ స్టోర్‌లో ఆర్ముడ్ రిజర్వు ఫోర్స్‌కు సంబంధించిన వివిధ రకాల పోలీసు సామగ్రిని భద్రపర్చనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అవసరమైనప్పుడు వాటిని వినియోగిస్తామన్నారు. పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఓల్డ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోల్ లైట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జగన్, ఎస్‌ఐ గోవర్ధన్, ఏఆర్ ఎస్‌ఐలు గౌస్‌పాషా, కళ్యాణ్, ప్రశాంత్ ,శివాజీ పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో నీటిపన్ను చెల్లింపునకు అవకాశం
నాగర్‌కర్నూల్: వంద రోజుల ప్రణాళికలో భాగంగా మిషన్ భగీరథ, మున్సిపాలిటీ నల్లా కనెక్షన్లు ఆన్‌లైన్ చేయడం జరిగిందని.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ నీటిపన్ను చెల్లించవచ్చని నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని గృహ యజమానులు నీటిపన్నును నేరుగా లేదా ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. ఇదివరకే ఎవరైనా మ్యానువల్‌గా నీటిపన్ను చెల్లించి రశీదు పొందితే.. ఆ వివరాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 91827 06723 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
ప్రతి చిన్నారికి
టీకాలు తప్పనిసరి
బిజినేపల్లి: ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వ్యాధినిరోధక టీకాలు వేయాలని డీఎంహెచ్‌ఓ కె.రవికుమార్ వైద్యసిబ్బందికి సూచించారు. శనివారం బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. వ్యాక్సిన్ శీతలీకరణ స్థితి, క్షేత్రస్థాయి సిబ్బంది ఏ సమయంలో వ్యాక్సిన్ తీసుకెళ్తున్నారు.. టీకాకరణ నమోదు వంటి పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం బిజినేపల్లి, మంగనూర్ ఆరోగ్య ఉపకేంద్రాల్లో టీకాకరణ ప్రక్రియను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా వందశాతం టీకాకరణ లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. ఈ మేరకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.
39మంది ఎస్‌ఏలకు జీహెచ్‌ఎంలుగా పదోన్నతి
కందనూలు: జిల్లాలో 39మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందారు. ఎస్‌ఏల పదోన్నతుల ప్రక్రియ బుధవారం రాత్రి నుంచి ప్రారంభం కాగా.. గురువారం వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంలుగా పదోన్నతి పొందిన ఎస్‌ఏలకు శుక్రవారం రాత్రి ఆర్డర్ కాపీలు ఇవ్వగా.. శనివారం ఆయా పాఠశాలల్లో రిపో ర్టు చేశారు. అదే విధంగా 106 మంది ఎస్జీటీలు పదోన్నతుల జాబితాలో ఉన్నారు. వీరిలో 84 మంది ఎస్‌ఏలుగా, 22 మంది పీఎస్ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందనున్నట్లు జిల్లా విద్యాశా ఖ అధికారులు తెలిపారు.
శనేశ్వరుడికి
తైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డేమాన్‌లోని జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తమ ఏలినాటి శని నివారణ కోసం శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తులచే ప్రత్యేక పూజలు చేయించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు.

పోలీసుల సంక్షేమానికి కృషి : ఎస్పీ

పోలీసుల సంక్షేమానికి కృషి : ఎస్పీ