
యూరియా పంపిణీలో అవకతవకలు
● పెద్దకొత్తపల్లిలో ఎరువుల దుకాణం సీజ్
● జిల్లా కేంద్రంలో డీలర్‌కు షోకాజ్ నోటీసు
నాగర్‌కర్నూల్/పెద్దకొత్తపల్లి/కల్వకుర్తి రూరల్: రైతులకు యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ఎరువుల డీలర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. పెద్దకొత్తపల్లిలోని అరుణోదయ సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణంలో శనివారం డీఏఓ యశ్వంత్‌రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే 15 రోజులుగా సంబంధిత డీలర్ పీఓఎస్ మిషన్‌లో రైతుల వివరాలను నమోదు చేయకుండా నేరుగా ఎరువులు విక్రయించినట్లు గుర్తించారు. పెద్దకొత్తపల్లికి 270 బస్తాల యూరియా వస్తే.. 40 బస్తాల యూరియాను పీఓఎస్ మిషన్‌లో నమోదు చేయకుండా విక్రయించడంతో 15 రోజులపాటు డీలర్ లైసెన్స్‌ను రద్దు చేసి దుకాణాన్ని సీజ్ చేసినట్లు డీఏఓ తెలిపారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న నాగార్జున ఫర్టిలైజర్స్ డీలర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో కొందరు డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని డీఏపీ, యూరియాను రూ. 200 వరకు అధికంగా విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.