
పైసలిస్తేనే పనులు చేస్తున్నారు..
నిరాధారణ ఆరోపణలు..
● అధికారుల తీరుతో
మత్స్యకారులకు ఇబ్బందులు
● జిల్లా మత్స్యశాఖ అధికారిణిని
సస్పెండ్ చేయాలి
● రసాభాసగా మత్స్య పారిశ్రామిక
సహకార సంఘం సర్వసభ్య సమావేశం
అచ్చంపేట రూరల్: జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని.. అధికారుల తీరుతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆరోపించారు. శనివారం మండలంలోని చంద్రసాగర్ చేపల ఉత్పత్తి కేంద్రం ఆవరణలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజిని సమావేశం ఎజెండా అంశాలను చదివి వినిపించారు. ఈ క్రమంలో కొందరు డైరెక్టర్లు కలగజేసుకుని అసలు ఎజెండా అంశాల్లో మత్స్యకారుల సమస్యలు లేవని.. తమకు సమావేశం సమాచారం కూడా నామమాత్రంగా తెలియజేశారని.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సంఘం చైర్మన్ వాకిటి ఆంజనేయులు మా ట్లాడుతూ.. జిల్లాలో మత్స్యకారులకు గుర్తింపేలేదని, జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని కూడా తూతూ మంత్రంగా నిర్వహించారన్నారు. అధికారు ల వల్ల మత్స్యకారులకు ఎలాంటి మేలు జరగడం లేదన్నారు. సంఘాల మధ్య పంచాయితీలు పెట్టడంతో పాటు కార్యాలయంలో చిన్నచిన్న పనులకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. స్టేజీపై నుంచి డైరెక్టర్లు కిందకు దిగి నేలపై బైఠాయించారు. జిల్లా మత్స్యశాఖ అధికారిణి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ విజయభాస్కర్ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
సర్వసభ్య సమావేశం గురించి నెల రోజుల ముందుగానే సమాచారం అందించాం. వారి మధ్య కుర్చీల కొట్లాట ఉంది. నాపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. సంఘానికి సంబంధించిన రికార్డులు కనిపించడం లేదు. ఈ విషయంపై మాట్లాడితే ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక మహిళా ఉద్యోగి అని చూడకుండా ప్రవర్తించడం సరైంది కాదు.
– రజని, జిల్లా మత్స్యశాఖ అధికారిణి