‘సర్కారు’కు సౌర వెలుగులు | - | Sakshi
Sakshi News home page

‘సర్కారు’కు సౌర వెలుగులు

Aug 20 2025 6:27 AM | Updated on Aug 20 2025 6:27 AM

‘సర్కారు’కు సౌర వెలుగులు

‘సర్కారు’కు సౌర వెలుగులు

అచ్చంపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు త్వరలోనే సౌర విద్యుత్‌ అందనుంది. తద్వారా విద్యుత్‌ ఆదా కావడంతో పాటు ఆయా శాఖలకు భారంగా మారుతున్న విద్యుత్‌ బిల్లుల చెల్లింపుపై ఊరట కలగనుంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో సౌర విద్యుత్‌ వినియోగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్‌ అందించేందుకు గాను సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల వివరాలు సేకరించేందుకు ఎంపీడీఓలను నోడల్‌ అధికారులుగా నియమించారు.

ప్లాంట్ల ఏర్పాటుకు వివరాల సేకరణ..

పక్కా భవనాలు ఉన్న కార్యాలయాల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పక్కా భవనాలు ఉన్న కార్యాలయాల వివరాలను టీజీ రెడ్కో అధికారులు సేకరిస్తున్నారు. ఏ భవనం ఎంత విస్తీర్ణంలో ఉంది? అక్కడ ఎంత విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉందనే వివరాలను మండలస్థాయి నుంచి సేకరిస్తున్నారు. ప్రధానంగా గ్రామపంచాయతీ, పాఠశాలలు, కళాశాలల భవనాలతో పాటు తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సాగునీటి ప్రాజెక్టుల కార్యాలయాలు.. ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

విద్యుత్‌ వినియోగం ఆధారంగా..

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం నెలకు ఎంత విద్యుత్‌ వినియోగం జరుగుతోంది..? ఎంత విద్యుత్‌ బిల్లు వస్తోందనే వివరాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు. ఈ లెక్కన తక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్న కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్‌ కింద, విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉన్న భవనాలకు హెచ్‌టీ సర్వీస్‌ కింద సోలార్‌ ప్లాంట్లను బిగించనున్నారు. రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు కరెంటు బిల్లులు వచ్చే కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్‌ కింద 3 నుంచి 5 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాలమైన భవనాలు కలిగి, ఎక్కువ విద్యుత్‌ వినియోగించే కార్యాలయాలకు హెచ్‌టీ సర్వీస్‌ కింద 100 కిలోవాట్లకు పైగా సోలార్‌ ప్లాంట్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వివరాలు సేకరిస్తున్న అధికారులు.. కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించి బడ్జెట్‌ కేటాయిస్తే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

నివేదిక పంపిస్తాం..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్ని కార్యాలయాలకు పక్కా భవనాలు ఉన్నాయి.. ఈ భవనాలపై సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఎంత మేర ఏర్పాటుచేసే అవకాశం ఉందనే వివరాలు సేకరిస్తున్నాం. ఇందుకు ఎంపీడీఓలను నోడల్‌ అధికారులుగా నియమించారు. వారు వివరాలు సేకరించి అందజేస్తారు. వీటన్నింటినీ క్రోడీకరించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం.

– మనోహర్‌రెడ్డి, డీఎం, రెడ్కో మహబూబ్‌నగర్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు

వివరాలు సేకరిస్తున్న

టీజీ రెడ్కో అధికారులు

ఇప్పటికే కలెక్టరేట్‌లో ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement