
ఎడతెరిపి లేకుండా..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా వరకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. గ్రామాలను అనుసంధానిస్తూ ఉన్న కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం పెరిగిపోవడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం జిల్లాలోని తిమ్మాజిపేట మండలంలో అత్యధికంగా 28 మి.మీ. వర్షపాతం నమోదైంది. బిజినేపల్లి, ఊర్కొండ, ఉప్పునుంతల, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మండలాల్లో 20 మి.మీ. మించి వర్షం కురిసింది. వంగూరు, వెల్దండ, చారకొండ మండలాల్లో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. జిల్లాకేంద్రం సమీపంలోని నల్లవాగుతో పాటు చర్లతిర్మలాపూర్ – ఉయ్యాలవాడ మధ్యనున్న చెరువు నిండి కాజ్‌వే మీదుగా నీటి ప్రవాహం ప్రమాదకరంగా కొనసాగుతోంది. ఈ దారిలో వెళ్లే విద్యార్థులను గ్రామస్తులు పుట్టీ ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దుందుబీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాడూరు మండలం సిర్సవాడ, కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద రాకపోకలను నిలిపివేశారు.
పంటలకు నష్టం..
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలను వరద ముంచెత్తుతోంది. బిజినేపల్లి, తాడూరు, కల్వకుర్తి మండలాల్లో సాగుచేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగింది. సుమారు 500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. పత్తి, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ముసురు వాన
తిమ్మాజిపేట మండలంలోఅత్యధికంగా 28 మి.మీ. వర్షపాతం
పలుచోట్ల పంటలను
ముంచెత్తిన వరద

ఎడతెరిపి లేకుండా..