
వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం/పెద్దకొత్తపల్లి/పెంట్లవెల్లి: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరు పీహెచ్‌సీతో పాటు పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మందుల స్టాక్‌ను పరిశీలించారు. పీహెచ్‌సీల్లో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు అందుబాటులో ఉంటూ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పీహెచ్‌సీల్లో కాన్పుల సంఖ్య పెంచాలన్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో వాగులు పారుతున్నందున అత్యవసర సమయంలో గర్భిణుల తరలింపునకు ఆటంకం ఏర్పడుతుందని.. ముందుగానే గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్పించాలని సిబ్బందికి సూచించారు. ఏదేని గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. కాగా, పెద్దకొత్తపల్లి పీహెచ్‌సీలో చిన్నారులకు డీఎంహెచ్‌ఓ వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి విజయ్‌కుమార్, డా.నారాయణ, శ్రీనివాసులు, డా.నరేంద్రనాథ్, సీహెచ్‌ఓ సంపూర్ణమ్మ, సిబ్బంది తదితరులు ఉన్నారు.