
‘చంద్రసాగర్–అమ్రాబాద్’ పథకం చేపట్టాలి
కొల్లాపూర్: అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పర్‌ప్లాట్ ఎగువ, దిగువ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపో తల పథకాన్ని వెంటనే చేపట్టాలని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవా చారి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన కొల్లాపూర్‌లో విలేకర్లతో మాట్లాడారు. పాలమూరు జిల్లా అవసరాలకు అనుగుణంగా కృష్ణా జలాలను వాడుకోవడంలో నేటికీ పాలకులు నిర్లక్ష్యం కనబరుస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వాటా వినియోగంలో జరిగిన అన్యా యాన్ని తెలంగాణ వచ్చాక కూడా సరిచేయడం లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన నిధుల కేటాయింపులు జరగడం లేదన్నారు. అచ్చంపేట ఎత్తిపోతల, ఉమామహేశ్వరం ఎత్తిపోతల పథకాలంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలపై పునఃసమీక్ష జరపాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి రంగానికి రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు.. అప్పర్‌ప్లాట్‌లోని 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎందుకు మనసు రావడం లేదో అర్ధం కావడం లేదన్నారు. అప్పర్‌ప్లాట్‌కు నీటి సమస్య తీర్చేందుకు పోరాట కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అనంతరం అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక గద్వాల జిల్లా కన్వీనర్ ఎండీ ఇక్బాల్ పాషా, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.వామన్‌కుమార్ పాల్గొన్నారు.