
శిథిల భవనాల్లో ఎవరూ ఉండొద్దు
● కృష్ణానదిలో బోటు ప్రయాణం నిషేధం
● అత్యవసర శాఖల అధికారులు
నిరంతరం అందుబాటులో ఉండాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశం
నాగర్‌కర్నూల్/వెల్దండ/చారకొండ: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శిథిల భవనాల్లో ఎవరూ ఉండొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అన్నిశాఖల అధికారులు 24గంటలు అందుబాటులో ఉంటూ.. సమగ్ర సమాచారంతో వరద నిర్వహణ కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శిథిల భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల్లో తరగతులు నిర్వహించవద్దని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అధిక వర్షపాతం నమోదు అయితే వెంటనే పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని డీఈఓ, డీడబ్ల్యూఓలను కలెక్టర్ ఆదేశించారు. వాగులు, పాటుకాల్వల్లో వరద సాఫీగా ముందుకు పారేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సాగునీటి కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సూచించారు. సోమశిల, ఇతర పర్యాటక ప్రదేశాల్లోని కృష్ణానదిలో బోటు ప్రయాణాన్ని నిషేధించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసవానికి రెండు, మూడు రోజుల సమయం ఉన్న గర్భిణుల సంరక్షణ బాధ్యత వైద్యారోగ్యశాఖ అధికారులదేనని అన్నారు. వర్షాల అనంతరం జిల్లాలో ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
● వెల్దండ సమీపంలో ఇటీవల కోతకు గురైన డీ–82 కాల్వను కలెక్టర్ పరిశీలించారు. కాల్వ మరమ్మతు పనులు నాణ్యతగా చేపట్టి త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా చారకొండ మండలం జూపల్లి శివారులో గండి పడిన డీ–82 కాల్వను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించి.. గండికి గల కారణాలపై ఆరా తీశారు. కాల్వ డిజైన్ మ్యాప్‌ను పరిశీలించారు. కాల్వ గండికి వేగంగా మరమ్మతు చేయించి.. ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. వారి వెంట కేఎల్‌ఐ చీఫ్ ఇంజినీరు విజయ్‌కుమార్, ఎస్‌ఈ పార్థసారధి, ఈఈ శ్రీకాంత్, డీఈఈలు దేవన్న, బుచ్చిబాబు తదితరులు ఉన్నారు.