
యూరియా.. ఏదయా?
వాతావరణం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు మండలాల్లో రైతులకు ఎరువుల కష్టాలు
● పీఏసీఎస్‌ల్లో ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ
● పంటలకు సరిపడా లభించక రైతుల ఆందోళన
● ఈ నెలలో 10వేల మె.టన్నులకు గాను 8,790 మె.టన్నులు మాత్రమే అందుబాటులో..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని పలుచోట్ల యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, పత్తి పంటలను రైతులు విస్తృతంగా సాగుచేయగా.. 15 రోజులుగా వరినాట్లు ఊపందుకున్నాయి. పంటలకు అవసరమైన ఎరువులను కొనుగోలు చేసేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు వస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టాదారు పాసుబుక్కులు, ఆధార్‌కార్డులతో వచ్చే రైతులకు ఒక్కొక్కరికి కేవలం రెండు బస్తాల యూరియాను మాత్రమే అధికారులు అందిస్తున్నారు. సాగుచేస్తున్న పంటల విస్తీర్ణంతో సంబంధం లేకుండా కేవలం రెండు బస్తాలను మాత్రమే ఇస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధిక వినియోగమూ కారణమే..
వరితో పాటు మొక్కజొన్న ఇతర పంటల సాగులో యూరియా వినియోగం ఏటా పెరుగుతోంది. రైతులు అవసరానికి మించి యూరియాను వినియోగిస్తున్నారని.. ఇది భవిష్యత్‌లోనూ పంటలకు, భూ సారానికి ప్రమాదకరమని అధికారులు అంటున్నారు. ఎకరాకు ఒక బస్తాకన్నా ఎక్కువగా యూరియాను వినియోగించొద్దని సూచిస్తున్నారు. అయితే జిల్లాలో ఐదేళ్లుగా యూరియా వినియోగం గణనీయంగా పెరిగింది. 2020లో 25వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తే.. ఈ ఏడాది 70,384 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుందని అధికారులు అంచనా వేశారు. పంటలకు యూరియా వినియోగం పెరుగుతుండటం.. సాగువిస్తీర్ణం పెరగడం.. సాగు సీజన్‌లో రైతులంతా ఒకేసారి ఎరువుల కోసం బారులు తీరుతుండటంతో యూరియాకు కటకట ఏర్పడుతోంది. సీజన్‌కు ముందుగానే యూరియాను స్టాక్ ఉంచి.. రైతుల అవసరాలను తీర్చాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. యూరియా కొరత ఉందన్న భావనతో రైతులు అవసరానికి మించి ఎక్కువ మొత్తంలో యూరియా కొనుగోలు చేసుకుని స్టాక్ పెట్టుకుంటుండటంతోనూ కొరత పెరుగుతోంది. ప్రైవేటు డీలర్ల వద్ద సైతం యూరియా లభించక, కొన్నిచోట్ల ఎమ్మార్పీకి మించిన ధరలకు విక్రయిస్తుండటంతో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ సైతం అవసరమైన యూరియా లభించక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒకేసారి వరినాట్లతో ఎరువులకు డిమాండ్..
వానాకాలం పంటల సాగు అంచనాకు అనుగుణంగా ముందుగానే యూరియా స్టాక్ రావాల్సి ఉంది. ఏటా మే, జూన్‌లోనే జిల్లాకు యూరియా రాగా.. ఈసారి ఆలస్యమైంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రతినెలా కనీసం 10వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ నెలలో జిల్లావ్యాప్తంగా కేవలం 8,790 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా అవసరమైన యూరియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. జిల్లాలో కృత్రిమ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
జలాశయాలకు జలకళ
ఉమ్మడి జిల్లాలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకోవడంతో పాటు దిగువకు పారుతున్నాయి.
–8లో u

యూరియా.. ఏదయా?