
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
నాగర్‌కర్నూల్ క్రైం: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో బాల్యవివాహాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడ పిల్లలకు చిన్న వయసులో వివాహం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పుట్టబోయే పిల్లల్లోనూ మానసిక, శారీరక ఎదుగుదల ఉండదన్నారు. ఎవరైనా బాల్యవివాహం చేసేందుకు యత్నిస్తే పోలీసులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
● జిల్లా కేంద్రంలోని సబ్‌జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని వారికి న్యాయ సేవాధికార సంస్థ తరఫున ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో సబ్‌జైలు సూపరింటెండెంట్ గుణశేఖర్ నాయుడు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్ తబితారాణి, చైల్డ్ కమిటీ చైర్మన్ లక్ష్మణరావు, శ్రీశైలం పాల్గొన్నారు.