
కదిలిస్తే కన్నీరే..
వీరందరూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ముంపు గ్రామమైన బండరాయిపాకులకు చెందిన సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఏదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారాన్ని ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గద్దలా తన్నుకుపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశ నిండా ముంచడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము చెల్లించిన డబ్బులను ఇవ్వాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.
..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్‌ఎల్‌ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఎవరైనా పెడితేనే తింటున్న..
నేను పని చేయలేను కాబట్టి నెలనెలా మిత్తి వస్తే ఖర్చులకు సరిపోతాయి.. బతకొచ్చు అనుకుని వచ్చిన డబ్బులను నా పేరు మీద రూ.5 లక్షలు ఫైనాన్స్‌లో పెట్టాను. నా కూతుళ్లు లక్ష్మీ రూ.5 లక్షలు, రుక్మమ్మ రూ.6 లక్షలు.. మొత్తం రూ.16 లక్షలు పెట్టాం. మొదట్లో మిత్తి డబ్బులు 2 నెలలు ఇచ్చాడు. ఆ తర్వాత మిత్తి లేదు.. అసలు లేదు నాకు ప్రస్తుతం అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఎవరైనా బయట పెడితే తింటున్న.. గుడిసెలో వెళ్లి పడుకుంటున్నా.
– భగవంతు, బాధితుడు
క్యాన్సర్ పేషంట్‌ను..గోలీలకూ డబ్బుల్లేవు..
పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్‌తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు.
– గోపాల బొజ్జమ్మ,
బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి
డబ్బుల్లేక మందులు తెచ్చుకోలేకపోతున్నాం..
నా భార్య పేరు మీద రూ.11 లక్షలు, నా పేరు మీద రూ.2 లక్షలు.. మొత్తం రూ.13 లక్షలు ఫైనాన్స్‌లో పెట్టాం. మాకు నలుగురు కూతుళ్లు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం మమ్మల్ని ఎవరూ చూడనీకే రావడం లేదు. నా భార్యకు చేయి విరిగింది. డబ్బుల్లేక మందులు తెచ్చుకోలేకపోతున్నాం. మా డబ్బులు మాకివ్వమని ఎవర్ని అడగాలో తెలియడం లేదు. మా మీద కనికరం చూపించి డబ్బులు ఇప్పించాలి.
– బింగి లింగయ్య, పాపమ్మ దంపతులు
కిరాయి ఇంట్లో ఉంటున్నాం..
తెలిసిన వాళ్లు మిత్తి వస్తుందని చెబితే.. మాకు పునరావాసం కోసం వచ్చిన డబ్బులు మొత్తం రూ.24 లక్షలను ఓం శ్రీ సాయిరాం చిట్‌ఫండ్‌లో నాలుగేళ్ల క్రితం పెట్టాం. ఇప్పటివరకు మాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేదు. కిరాయికి వేరొకరి ఇంట్లో ఉంటున్నాం. నేనూ మా ఆయన ఇద్దరం కూలీ చేసుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉంటే.. దుడ్డు మల్లయ్య అనే వాళ్లతో రూ.2.60 లక్షలు కట్టించాను. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.
– గోపాల పార్వతమ్మ, బాధితురాలు
నాన్న దూరమయ్యాడు..
కుటుంబం రోడ్డున పడింది..
మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్‌ఫండ్‌లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు.
– కుర్మయ్య, బాధితుడు
అతికష్టం మీద బతుకుతున్నాం..
నా పేరు, నా భర్త మీద రూ.6 లక్షలను 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో పెట్టాం. మాకు నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మాతో డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని ఎవరూ చూసుకోవడం లేదు. ఉన్న కొడుకు కూడా విడిగా ఉంటున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది. ఒక కన్ను సరిగా కనిపించడం లేదు. అతికష్టం మీద బతుకుతున్నాం. డబ్బులు అనవసరంగా ఎవరికో ఇచ్చి ఇలా చేశారని కొడుకు, కోడలు నిత్యం తిడుతూనే ఉన్నారు. మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి.
– మిద్దె నాగమ్మ, బాధితురాలు
ఫైనాన్స్ మోసంతో పీఆర్‌ఎల్‌ఐ నిర్వాసితుల విలవిల
ఇప్పటికే కొందరి బలవన్మరణం..గుండెనొప్పితో తనువు చాలించిన మరికొందరు..
వైద్య చికిత్సలకు డబ్బుల్లేక మంచానికే
పరిమితమైన ఇంకొందరు..
ఇళ్లు కట్టుకోలేక..పిల్లలను చదివించలేనిదుస్థితిలో పలువురు..
ఆలనాపాలన కరువై ఆదుకునే వారి కోసం వృద్ధుల ఎదురుచూపులు..