
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం
నాగర్‌కర్నూల్: పాలమూరు –రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులతో భూ సేకరణ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చివరి దశలో ఉన్న భూ సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తిచేసేందుకు సర్వేల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, నీటిపారుదల ప్రాజెక్టుల సీఈ విజయభాస్కర్‌రెడ్డి, ఈఈ మురళి ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో వీసీ నిర్వహించగా.. సమీకృత కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కమాండ్ కంట్రోల్ రూంను కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూం నంబర్ 98667 56825 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,633 చెరువులు, కుంటలు తెగిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా నదీ తీరం, లోతట్టు ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల్లో తరగతులు నిర్వహించరాదన్నారు. వర్షాల కారణంగా సమస్య తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
అచ్చంపేట రూరల్: అచ్చంపేట పట్టణంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొనగా.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఓ ఫంక్షన్‌హాల్ వరకు ఆదివాసీలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడారు. త్వరలోనే మన్ననూర్ ఐటీడీఏ పీఓను నియమిస్తామన్నారు. అర్హులైన ఆదివాసీ చెంచులకు పోడు పట్టాలు అందజేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. చెంచులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం చెంచు ఉద్యోగులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రోహిత్ గోపిడి, నాయకులు నాగయ్య, శ్రీనివాసులు, శంకరయ్య, ప్రసాద్, పద్మ పాల్గొన్నారు.