
కేఎల్‌ఐ డీ–82 కాల్వకు గండి
చారకొండ: మండలంలోని జూపల్లి శివారులో కేఎల్‌ఐ డీ–82 ప్రధాన కాల్వ బుధవారం కోతకు గురైంది. కాల్వ నీరంతా సమీపంలో సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలను ముంచెత్తింది. సమాచారం అందుకున్న కేఎల్‌ఐ అధికారులు కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. డీఈ సమ్మయ్య అక్కడికి చేరుకొని కాల్వ గండిని పరీశీలించారు. కాల్వలో నీటి ప్రవాహం పెరగడంతోనే గండి పడినట్లు పేర్కొన్నారు. అయితే ప్రతి ఏటా డీ–82 కాల్వ ఎక్కడో చోట తెగిపోతుండటంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. అధికారులు కాల్వల నిర్వహణను గాలికి వదిలేయడంతోనే కోతకు గురవుతుందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, డీ–82 కాల్వకు గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టడంతోనే పూర్తిగా కోతకు గురైందని కేఎల్‌ఐ అధికారులు చారకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ షంషోద్దీన్ కాల్వ గండి ప్రదేశాన్ని పరిశీలించారు. కాల్వ గండికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు లకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా, కాల్వకు త్వరగా మరమ్మతు చేయించి సాగునీటి విడుదలను పునరుద్ధరిస్తామని కేఎల్‌ఐ ఎస్‌ఈ పార్థసారధి తెలిపారు.