తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉందాం
నాగర్‌కర్నూల్ క్రైం: తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉండటంతో పాటు చికిత్స అందించేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. వెంకటదాసు కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తలసేమియా అవగాహన ర్యాలీ నిర్వహించగా.. ఆయన పాల్గొని ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. తలసేమియా వ్యాధి జన్యుపరమైన లోపంతో తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి గల చిన్నారులు అలసిపోవడం, పెరుగుదల లోపించడం, తరచుగా అంటువ్యాధులకు గురికావడం, హిమోగ్లోబిన్ రెండు నుంచి మూడు గ్రాములు మాత్రమే ఉంటుందని వివరించారు. వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రక్తం ఎక్కించడంతో పాటు రక్త పరీక్షలు చేయాలన్నారు. ఈ వ్యాధి గల చిన్నారులకు రక్త సంబంధీకుల ద్వారా ఎముక మజ్జ మార్పిడి చేయాల్సి ఉంటుందని.. ఇందుకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. మేనరిక వివాహం, వివాహానికి ముందు తలసేమియా నిర్ధారణ పరీక్షలు చేసుకోవడంతో వ్యాధిని నివారించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సికిల్‌సెల్ నోడల్ అధికారి డా. ప్రదీప్, పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. వాణి, ఎంఎల్‌హెచ్‌పీ నీరజ్, ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


