పేదల పక్షాన అలుపెరగని పోరాటాలు
నాగర్‌కర్నూల్ రూరల్: సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా సీపీఐ పార్టీ పేదల పక్షాన నిలిచి వందేళ్లుగా అలుపెరగని పోరాటాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల్‌నర్సింహ్మ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సంతబజారు నుంచి 100 మీటర్ల ఎర్ర జెండాతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో బాల్‌నర్సింహ మాట్లాడారు. కష్టజీవుల వెన్నంటి ఉంటూ.. పేద ప్రజల పక్షాన పోరాడుతున్న ఘనత సీపీఐకే దక్కుతుందన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఎంతో మంది పార్టీ నేతలు జైలు జీవితం గడిపారని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు రక్తర్పణ చేశారన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని వచ్చే నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలు, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆనంద్, కేశవులుగౌడ్, వార్ల వెంకటయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


