బకాయిల చెల్లింపులో జాప్యం తగదు
కల్వకుర్తి రూరల్: ఉపాధ్యాయులకు అందించాల్సిన బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని.. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు. విడతల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నప్పటికీ.. అనేక మంది ఉపాధ్యాయులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్, సరెండర్ బిల్లులు ఏడాదికాలంగా అందడం లేదన్నారు. 2023 జూలై 1 నుంచి అమలుచేయాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, మెరుగైన వేతన సవరణ అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. సమావేశంలో ఏపీ మల్లయ్య, శ్రీధర్ శర్మ, చిన్నయ్య, తిరుపతయ్య, బాల్‌రాజ్, చంద్రశేఖర్, మహేశ్‌బాబు, శంకర్, లక్ష్మణ్, నెహ్రూ ప్రసాద్, శశికళ, కురుమయ్య, లింగమయ్య ఉన్నారు.


