నేడు కవిత పర్యటన
నాగర్‌కర్నూల్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎల్లూరులోని ఎంజీకేఎల్‌ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌లను ఆమె సందర్శించనున్నారు. అనంతరం పెంట్లవెల్లికి చేరుకొని పంట రుణమాఫీ బాధితులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి పెద్దకొత్తపల్లికి చేరుకొని ఎరుకల సంఘం, ముదిరాజ్ సంఘం సభ్యులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. 12:30 గంటలకు కొల్లాపూర్ మామిడి మార్కెట్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చేరుకొని సిర్సవాడ బ్రిడ్జిని పరిశీలిస్తారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలతో పాటు వట్టెం రిజర్వాయర్, పంప్‌హౌజ్‌ను పరిశీలిస్తారని తెలంగాణ జాగృతి నాయకులు తెలిపారు.
నేడు డయల్
యువర్ డీఎం
అచ్చంపేట రూరల్: అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పి.మురళీ దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 94408 18849 నంబర్‌ను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
ఉపాధి హామీ
చట్టానికి తూట్లు
కల్వకుర్తి రూరల్: వామపక్ష పార్టీలు పోరాడి సాధించిన ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు ఆరోపించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రాంజీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. అసంఘటితరంగా కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులకు నష్టం చేకూరుస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని కనుమరుగు చేసే విధంగా తెచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సి.ఆంజనేయులు, పరశురాములు, ఏపీ మల్లయ్య, శ్రీనివాసులు, బాలయ్య, ఆంజనేయులు, యాదయ్య, పర్వతాలు, కిరణ్, వెంకటయ్య పాల్గొన్నారు.


