
లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేయాలి
అచ్చంపేట: దేశవ్యాప్తంగా మే 20 నుంచి జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. సోమవారం అచ్చంపేట మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్నా కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. 44 కార్మికుల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని, ఉన్న చట్టాలను కాలరాయడమే తప్ప కార్మికులకు మేలు చేయలేదని దుయ్యబట్టారు. సంఘాలు లేకుండా చేస్తున్న మోదీ దిమ్మ తిరిగే విధంగా సమ్మెను చేద్దామని, కార్మికులు కలిసి రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అసంఘటిత, సంఘటిత రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ భవిష్యత్ తరాలకు బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. కార్మికులను రెగ్యులర్ చేసి ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వా లని డిమాండ్ చేశారు.జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతాలు, జిల్లా సహాయక కార్యదర్శి శంకర్‌నాయక్, పట్టణ కార్యదర్శి రాములు, నాయకులు మధు, సురేష్, సాయిలు, వెంకటయ్య, రమేష్, హరీష్, వెంకటమ్మ, బాలమ్మ, సుభద్రమ్మ పాల్గొన్నారు.