‘అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు’
కల్వకుర్తి రూరల్: ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలు అమలులో ఘోర వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, అర గ్యారంటీ కూడా చేయలేదన్నారు. దళిత బంధు, ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కూటీలు, తులం బంగారం అన్ని పథకాలు పక్కన పెట్టి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామన్నారు. ఈ సందర్భంగా చలో వరంగల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 3 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలివస్తారన్నారు. ప్రతి కార్యకర్త కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసి జనరంజక, రైతు ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌గౌడ్, విజితారెడ్డి, గోవర్ధన్, రాంరెడ్డి, బాలయ్య, మధు పాల్గొన్నారు.


