తాడూరు: మండలంలోని శిర్సవాడ అనుసరించి పారుతున్న దుందుభీ వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ బ్రిడ్జి లేకపోవడంతో ఏటా వానాకాలంలో నాగర్‌కర్నూల్, జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.20.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేసింది. ఈ మేరకు నిధుల మంజూరుకు కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో జడ్చర్ల, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలకు మధ్య రాకపోకల కష్టాలు తీరనున్నాయి. త్వరలో పనులు చేపట్టి బ్రిడ్జిని వీలైనంత తొందరగా అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలోనూ ఇక్కడ ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో పలు కథనాలు సైతం వెలువడ్డాయి.