
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ
● రాష్ట విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్
నాగర్‌కర్నూల్: జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో విపత్తు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా అత్యధికంగా వర్షపాతం నమోదైందని, మరోసారి అల్పపీడనం ఏర్పడే హెచ్చరికలు ఉన్నందున నెల రోజుల పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. క్లౌడ్ బరస్ట్ జరిగితే స్పందిచాల్సిన విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా శాఖలకు సంబంధించి నష్ట వివరాలను కలెక్టర్ అందించాలన్నారు.
పూడికతీతలో వేగం పెంచాలి
జిల్లాలో ప్రధానంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాలాల్లో పూడికతీత పూర్తి చేయాలని, వరద నీరు వేగంగా బయటకు వెళ్లేలా చూడాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది, డీఆర్‌ఎఫ్ బృదాలు ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక చర్యల్లో కీలకంగా వ్యహరించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎండీఆర్‌ఎఫ్ ద్వారా ముందస్తు చర్యలు పక్కాగా చేపడితే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చన్నారు.
విపత్తు సహాయ చర్యల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వర్షపాత తీవ్రతను గుర్తించి అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆగస్టు 14న జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, వరద నీటి ప్రవాహం కారణంగా లోలెవెల్ కాజ్‌వేలు మునిగిపోగా.. భారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించామని వెల్లడించారు. అంతకుముందు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని చర్లతిర్మలాపూర్, సిర్సవాడలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను వారు పరిశీలించారు. వరదలతో ధ్వంసమైన రహదారులు, చెరువులు, వాగులు, వంతెనలు, తాగునీటి సౌకర్యాలు, వ్యవసాయ పొలాలు, విద్యుత్ లైన్లకు వీలైనంత వేగంగా మరమ్మతు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.