
లైసెన్స్ లేని డ్రైవర్లు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు చేస్తున్నా మారని తీరు
నాగర్‌కర్నూల్ క్రైం: వాహనాలను నడపాలంటే లైసెన్సు తప్పనిసరి అని మోటారు వాహన చట్ట నిబంధనలు చెబుతున్నప్పటికీ.. తమకేమి సంబంధం లేదంటూ మైనర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ద్విచక్రవాహనాల నుంచి భారీ వాహనాలను సైతం నడుపుతున్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో మైనర్లు ర్యాష్‌డ్రైవింగ్ చేస్తూ తరుచూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల మైనర్ల ర్యాష్ డ్రైవింగ్‌తో పలువురు ఆసుపత్రుల పాలయిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అడ్డు చెప్పాల్సిన తల్లిదండ్రులు అప్పటికప్పుడు వారి అవసరం కోసం మైనర్లకు వాహనాలు ఇస్తుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కఠినంగా వ్యవహరిస్తున్నా..
జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే జరిగే పరిణామాలతో పాటు విధించే శిక్షల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మైనర్ల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. జిల్లాలోని పలువురు విద్యార్థులు యథేచ్ఛగా ద్విచక్ర వాహనాలను పాఠశాలలకు, కళాశాలలకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ద్విచక్రవాహనాలను పాఠశాలలకు, కళాశాలలకు తీసుకొస్తే సదరు యాజమాన్యం గుర్తిస్తారని వాటిని దూరంగా పార్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు పాఠశాలల సమయంలో తనిఖీలు నిర్వహిస్తే ద్విచక్రవాహనాలను నడిపే మైనర్లను గుర్తించే ఆస్కారం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
రెండేళ్లలో నమోదైన
మైనర్ డ్రైవింగ్ కేసులు
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్‌పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాతో పాటు కేసులు సైతం నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 2024 సంవత్సరంలో 270 కేసులు నమోదు చేసి రూ.1.35 లక్షల జరిమానా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 130 కేసులు నమోదు చేసి రూ.65 వేల జరిమానా విధించారు.
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. మైనర్ డ్రైవింగ్‌పై తనిఖీలు నిర్వహించే సమయంలో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నాం. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకోవడం పాటు జైలుకు పంపిస్తాం.
– గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్, ఎస్పీ
వాహనాలతో దూసుకుపోతున్న మైనర్లు
ర్యాష్ డ్రైవింగ్‌తో తరచూ ప్రమాదాలు
విద్యాసంస్థలకు సైతం వాహనాలు తీసుకెళ్తున్న వైనం

లైసెన్స్ లేని డ్రైవర్లు