
యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఊర్కొండ: రైతులకు అవసరమైన యూరియాను ఫర్టిలైజర్ షాపుల యజమానులు అధిక ధరలకు వి క్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవ సాయ అధికారి యశ్వంత్‌రావు హెచ్చరించారు. బుధవారం మండలంలోని రైతు కేంద్రం, పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ మండల రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచామని, ఎవరైనా డీలర్లు కృత్తిమ కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. డీలర్లు విధిగా స్టాక్ బోర్డులను అప్డేట్ చేయాలని ఆదేశించారు. రైతులు వారి అవసరం మేరకు ఎరువులు తీసుకోవాలని కోరారు. యూరియాను అధికంగా వాడడం వల్ల పంటకు చీడ పీడలు ఆశించి, దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. సాధారణ యూరియాతో పోలిస్తే నత్రజని వినియోగ సామర్థ్యం నానో యూరియాలో ఎక్కువగా ఉంటుందని, నానో యూరియాను ఇతర పురుగు మందులతో కూడా కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల రైతులకు శ్రమ, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. మండలంలో గతేడాది వానాకాలంలో 151 మె.టన్నుల యూరియా సరఫరా చేయగా.. ఈ ఏడాది 427 మె.టన్ను యూరియా సరఫరా చేశామన్నారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కిరణ్‌కుమార్, ఏఓ దీప్తి పాల్గొన్నారు.