
ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాలి
కల్వకుర్తి టౌన్: ప్రతి ఒక్కరూ వారి పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు వినాయక మండపాలను రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు సృష్టించొద్దని కోరారు. తప్పనిసరిగా పోలీస్‌శాఖ వారు రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో వారి మండపాలను రిజిస్ట్రర్ చేసుకోవాలన్నారు. వీటికి తోడు మంటపాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బుక్‌లోనూ విధిగా పోలీసు వారి తనిఖీలను రాసేలా చూడాలని పేర్కొన్నారు. నిమజ్జనానికి డీజేలను వాడకుండా.. భక్తిగీతాలను ఆలపించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఎస్‌ఐలు మాధవరెడ్డి, రాజశేఖర్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీను, మున్సిపల్ ఏఈ షబ్బీర్, వినాయక మంటపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
సాయంత్రమే నిమజ్జనం చేయాలి
తిమ్మాజిపేట: వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు డీజేలతో కాకుండా భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలు ఆలపిస్తూ నిర్వహించాలని నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. తిమ్మాజిపేటలో ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం రోజు సాయంత్రం 4 లేదా 5 గంటలకు వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రారంభిస్తే పెద్దలు, మహిళలు, చిన్నారులు వీక్షించి మొక్కులు తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతక ముందు పోలీస్‌స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ అశోక్‌రెడ్డి, ఏఎస్‌ఐ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.