
20 ఏళ్లుగా ఎదురుచూపే..
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వ్యవసాయానికి సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు దాదాపుగా 20ఏళ్లుగా నిరాశే మిగులుతోంది. కేఎల్‌ఐ కాల్వ కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి వరకు ఉంది. ఇందులో భాగంగా వంగూర్, చారకొండ, వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలంలోని నాగిళ్ల రైతులకు సాగునీరు అందించడానికి 65 కి.మీ పొడవున డీ–82 కాల్వ తవ్వకాలు చేపట్టారు. దీంతో దాదాపుగా 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు అంచనా వేశారు.
నిరంతరం ఏదో ఒకచోట..
ఇటీవల డీ–82 కాల్వ పనులు దాదాపుగా పూర్తి చేసుకున్నా తరుచుగా తెగిపోతుండడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. మండలంలోని లింగారెడ్డిపల్లి వద్ద కాల్వ తెగడంతో అధికారులు సరిచేశారు. పోతేపల్లి, వెల్దండ శివారులోనే ఒకే చోట 5 సార్లు కాల్వ తెగిపోయింది. చొక్కన్నపల్లి వద్ద ఒకసారి, బండోనిపల్లి సమీపంలో ఒకసారి, చారకొండ మండలం జూపల్లి వద్ద మరోసారి కాల్వలకు గండ్లు పడడంతో సాగునీరు వృథాగా పోతుంది.
60వేల ఎకరాల సాగునీరు
బీడు భూములకు డీ–82 కాల్వ ద్వారా కల్వకుర్తి నియోజవర్గంలో దాదాపుగా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వంగూర్ మండలంలో కొంత భాగం కలుపుకొని చారకొండ, వెల్దండ మండలాల్లో 40 కిలోమీటర్ల దూరం కాల్వ రావడంతో 29వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, మాడ్గుల మండలంలోని జంగారెడ్డిపల్లి చివరి ఆయకట్టు వరకు 25 కిలోమీటర్ల దూరం కాల్వ రావడంతో మరో 29వేల ఎకరాలకు పైగానే సాగునీరు పారుతుందని కేఎల్‌ఐ అధికారులు తెలిపారు. వెల్దండ మండలంలోని భర్కత్‌పల్లికి నీరు చేరుకోక ముందే డీ–82 కాల్వకు ఎక్కడో ఒకచోట గండిపడుతుంది.
సాగునీటి కోసం రైతులకు తిప్పలు
వెల్దండలో తరుచుగా తెగుతున్నడీ–82 కాల్వ
కొరవడిన అధికారుల పర్యవేక్షణ