ములుగు రూరల్: నవజాత శిశు మరణాలు తగ్గింపునకు కృషి చేస్తామని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సామాజిక అవగాహన, నిమోనియా కార్యక్రమాలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆర్‌బీఎస్‌కే వైద్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలను తగ్గించడానికి తటస్థీకరణ చర్య శిక్షణ ఉపయోగపడుతుందని వెల్లడించారు. నిమోనియా నివారణకు రక్షణ పద్ధతుల గురించి వివరించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా పిల్లల సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లల్లో వ్యాధిని ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు సుధాకర్ నాయక్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రవితేజ, సంపత్, అనిల్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


