విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం

Nov 17 2026 1:20 AM | Updated on Nov 17 2026 1:20 AM

● ఐటీడీఏ పీఓ

లెనిన్‌ వత్సల్‌ టోప్పో

ఏటూరునాగారం: గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా విద్యా ప్రతిభ, సృజనాత్మకత, కళలు, క్రీడా నైపుణ్య పోటీలు నిర్వహించాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నారు. ఈ మేరకు ఈ నెల 13న ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో ఐదు విభాగాల్లో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచిన ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. అందులో ఒక్కో క్లబ్‌లో ఒక్కో విజేతను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి పీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించే దిశగా ఐటీడీఏ కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకే పరిమితం కాకుండా సాహిత్యం, కళలు, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి రంగాల్లోనూ రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా ఐదు క్లబ్‌లలో నిర్వహించిన పోటీలలో జిల్లాలోని ఆకులవారిఘణపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన జి. ప్రియాంక లిటరరీ క్లబ్‌లో ప్రథమ బహుమతి సాధించారు. అలాగే చిరుతపల్లి పాఠశాలకు చెందిన అంకిత ఆర్ట్‌ కల్చర్‌లో ప్రతిభ కనబర్చగా మేడారం ఆశ్రమ పాఠశాలకు చెందిన అక్షర ఫిట్‌నెస్‌లో ప్రతిభ కనబర్చి బహుమతి అందుకున్నారు. అలాగే ఆకులవారిఘణపురం పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎకో క్లబ్‌ విభాగంలో రిషిత, ఎస్‌ఎస్‌ తాడ్వాయి ఆశ్రమ పాఠశాలకు చెందిన జశ్విక సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పోటీలో ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతి గెలుచుకుంది. అలాగే ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ప్రతాప్‌, డీడీ జనార్దన్‌, డీటీ అనిల్‌కుమార్‌, ఏటీడీఓ అజయ్‌కుమార్‌, డిప్యూటీ ఈఓ వీరులాల్‌, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం ధరావత్‌ రాజు, ఏసీఎంఓ వాగ్య, స్పోర్ట్స్‌ అధికారులు శ్యామలత, ఆదినారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement