ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను విజయవంతం చేయాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 20 వేదికలపై వివిధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ప్రతిష్టాత్మకమని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ధర్మానాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రణీతకు కన్సోలేషన్ బహుమతి
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 6వ వార్డుకు చెందిన జాడి దుర్గారావు కుమార్తె ప్రణీత స్థానికంగా ఉన్న పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతోంది. గో సేవా సమితి వారు ఆదివారం హైదరాబాద్‌లో ఆవులతో ఉపయోగాలు, వాటి వల్ల కలిగే లాభాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రణీత పాల్గొని విజయం సాధించి కన్సోలేషన్ బహుమతిని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నుంచి అందుకుంది. ఈ మేరకు సోమవారం పాఠశాలలో ప్రణీతను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసం సాంబశివరావు, ఇన్‌చార్జ్ హెడ్మాస్టర్ రాజన్న, ఇంగ్లిష్ టీచర్ మాధురి, రవి, నాగరాజు, గోనె రవి, తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వివరించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఏటూరునాగారం: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్ అన్నారు. మండల పరిధిలోని గోగుపల్లిలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి న్యాయమైన మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నవడ్లు ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.2,461, దొడ్డు వడ్లు బి గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.2,441 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ఆర్టీఏ డైరెక్టర్ శ్రీనివాస్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేల వినయ్, మండల ఆత్మ కమిటీ డైరెక్టర్ రాకేశ్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి, శివాపురం సర్పంచ్ జబ్బ సరోజ తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాస యాత్రలకు ప్రత్యేక బస్సులు
భూపాలపల్లి అర్బన్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలు, అరుణాచలం యాత్రలతో పాటు అయ్యప్ప భక్తుల కోసం భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు డిపో మేనేజర్ చేరాల మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 36మంది లేదా అంతకంటే ఎక్కువ మంది భక్తులు బృందంగా ఉంటే వారి ఇంటి వద్దకే బస్సును పంపించే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల యాత్రా మార్గం, ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా ప్రత్యేక అద్దె ప్రాతిపదికన అనుభవజ్ఞులైన డ్రైవర్లతో బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుకింగ్ కోసం 99592 26707, 98663 73825, 73828 54256 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.


