● పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు రూరల్: అర్హులందరికీ ప్రజా ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వివిధ రకాల పింఛన్లు అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం ఇంచర్లలోని ఎంఆర్ గార్డెన్‌లో నూతన పింఛన్‌దారులకు మంజూరు పత్రాలను కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4.70లక్షల మందికి నూతన పింఛన్లు మంజూరు చేసి అందిస్తున్నామని తెలిపారు. ఇందులో అత్యధికంగా 3.50లక్షల పింఛన్లు మహిళలకు మంజూరు చేశామని తెలిపారు. పింఛన్ల మంజూరులో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించామని వెల్లడించారు. వితంతువులు, ఒంటరి మహిళలు ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తకుండా భరోసా కల్పిస్తున్నామన్నారు. మహిళలు ఆర్ధికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేస్తున్నామని వివరించారు. కుటుంబంలో పెద్ద మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు. తొలిసారిగా తలసేమియా బాధితులకు సైతం పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, డీఆర్‌డీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు.


