ములుగు రూరల్: మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన సంచార వైద్యం సత్ఫలితాలు ఇస్తుంది. పశుపోషకులు జీవాలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే 1962 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించి వైద్యసేవలు పొందేందుకుగాను అవకాశం కల్పించింది. దీంతో రైతులు ఫోన్‌లో అందించిన సమాచారం మేరకు కోరిన ప్రాంతానికి వెళ్లి పశువులకు సిబ్బంది అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. సంచార వాహనాల్లో పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు వైద్యానికి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. దీంతో ములుగు నియోజకవర్గం పరిధిలో పశువుల మరణాలు తగ్గుముఖం పట్టాయి.
ఉత్తమ సేవలు..
ములుగు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో సంచార వైద్యం సత్ఫలితాలను ఇస్తుంది. మండల కేంద్రాల్లోని పశువైద్య కేంద్రాలు, గ్రామాల్లో పశువైద్య ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ సంచార వైద్యం పశుపోషకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆస్పత్రి పని వేళలతో సంబంధం లేకుండా సంచార వైద్యం అందించడంతో మూగజీవాలకు అత్యవసర వైద్యసేవలు అందుతున్నాయి. సంచార వైద్యంతో మూగజీవాలను నిరంతరం ఆరోగ్య రక్షణకు ఉత్తమ సేవలు అందుతున్నాయి.
రెండు మండలాలకు సేవలు నిల్
జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో పశువులకు సంచార వైద్య సేవలు అండదం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలు ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి ములుగు జిల్లాలో కలిశాయి. అప్పటి నుంచి ఈ రెండు మండలాలకు 1962 సేవలు అందడం లేదు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు సైతం సంచార వైద్య సేవలు అందించాలని పశుపోషకులు కోరుతున్నారు.
జిల్లాలో పశువైద్య కేంద్రాలు
జిల్లాలోని పది మండలాల పరిధిలో పశువైద్య కేంద్రాలు 15 ఉండగా.. పశు ఉపవైద్య ఉప కేంద్రాలు 16 ఉన్నాయి. అలాగే ఏరియా ఆస్పత్రులు ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం(కె)లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 12 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2021 నుంచి 2026 అక్టోబర్ వరకు 51,909 పశువులకు సంచార వైద్యం ద్వారా సిబ్బంది వైద్య సేవలు అందించారు.
సత్ఫలితాలు ఇస్తున్న సంచార వైద్యం
1962 ఫోన్ చేస్తే అత్యవసర సేవలు
సద్వినియోగం చేసుకుంటున్న
పశు పోషకులు


