న్యూస్‌రీల్
సీసీఐ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: రైతులు సాగు చేసిన పత్తి పంట కొనుగోలుకు సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వే బ్రిడ్జిలు, కంప్యూటర్లు, ఇతర వసతులను పరిశీలించారు. జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలను గుర్తించి సీసీఐకి నివేదికలు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కొనుగోలుకు కపాస్ కిసాన్ యాప్‌ను తీసుకొచ్చింది. పత్తిసాగు చేసిన రైతులు పంట అమ్మకం సమయంలో యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని పంటను మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్ముకోవచ్చు.
సీసీఐ కొనుగోలు కేంద్రాల ఎంపిక
జిల్లాలోని పది మండలాల పరిధిలో 27వేల ఎకరాల్లో రైతులు పత్తిసాగు చేశారు. ఈ ఏడాది పత్తి దిగుబడి అంచనా 2.52లక్షల క్వింటాల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని సీసీఐ కొనుగోలుకు లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్, శ్రీసాయిలక్ష్మీ ఇండస్ట్రీస్, రాజరాజేశ్వర కాటన్ ఇండస్ట్రీస్‌లను ఎంపిక చేశారు. ములుగు మార్కెట్ పరిధిలో ఉన్న వాటినే సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా గుర్తించారు.
8 శాతం తేమ ఉంటేనే
మద్దతు ధర
కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు మద్దతు ధర తేమ నిబంధనల మేరకు రూ. 8,667గా ప్రకటించింది. 8 శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభించే అవకాశం ఉంది. అంతకంటే 1శాతం తేమ ఎక్కువ ఉంటే మద్దతు ధర నుంచి రూ.86.67పైసలు ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. రైతులు నిబంధనల మేరకు పత్తి పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందవచ్చు. నిబంధనల మేరకు పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చి రైతులు విక్రయించవచ్చు.
ప్రైవేట్ వ్యక్తులు అధిక ధర
పత్తి ఽకొనుగోలుకు క్వింటాకు ప్రభుత్వ నిబంధనల మేరకు 8శాతం తేమ ఉన్నా పత్తికి మద్దతు ధర రూ.8,667కు కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు పత్తి కొనుగోలు చేపడుతున్నారు. రూ. 9వేల నుంచి 8,800 వరకు ధరలు కొనసాగుతున్నాయి. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పత్తి అమ్మకాలు చేపట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.
జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా
27వేల ఎకరాల్లో పత్తిసాగు
2.52లక్షల క్వింటాళ్ల దిగుబడి
వస్తుందని అంచనా
క్వింటాకు మద్దతు ధర రూ.8,667
మద్దతు ధరకు మించి
ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు
కపాస్ కిసాన్ యాప్ డౌన్‌లోడ్ ఇలా..
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర సక్రమంగా అందించేందుకు గతేడాది నుంచి కపాస్ కిసాన్ యాప్ కొనుగోళ్లు చేపడుతుంది. రైతులు స్మార్ట్ ఫోన్లలో ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పట్టాదారు పాస్‌బుక్‌తో పాటు పత్తి సాగు చేసిన భూమి సర్వే నంబర్, ఆధార్, ఇతర వివరాలను నమోదు చేయాలి. రెవెన్యూ అధికారుల నుంచి పత్తిపంట సాగు ధృవీకరణ పత్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలను అందించాలి. దీంతో వివరాలు సీసీఐకి చేరుతాయి. రైతులు ఫోన్‌ద్వారా గాని, ఆన్‌లైన్ సెంటర్‌లో గాని, వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద గాని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పత్తి సాగు చేసిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. నిబంధనల మేరకు పత్తి అమ్మకాలు చేపట్టి మద్దతు ధర పొందాలి. కపాస్ యాప్ ద్వారా రైతులు పత్తిని సులువుగా అమ్ముకోవచ్చు. రైతులు తప్పని సరిగా పంట వివరాలను నమోదు చేసుకోవాలి. కపాస్ కిసాన్ యాప్‌తో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వారికి వచ్చిన తేదీ ప్రకారం పత్తి అమ్ముకోవచ్చు. – సోనియా, మార్కెట్ కమిటీ కార్యదర్శి, ములుగు


