ఏటూరునాగారం: ఐటీడీఏ, జీసీసీ ద్వారా పెండింగ్‌లో ఉన్న రూ.32 లక్షల బకాయి డబ్బులు చెల్లించాలని శ్రీ సమ్మక్క–సారలమ్మ జాయింట్ లైబిలిటి గ్రూప్ సభ్యులు(సబ్బుల పరిశ్రమ) సౌజన్య, లక్ష్మి వేడుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బకాయి వివరాలను వారు వెల్లడించారు. మండల పరిధిలోని శివాపురంలో శ్రీ సమ్మక్క–సారలమ్మ జాయింట్ లైబిలిటి గ్రూప్ పేరుతో పదిమంది కలిసి డిటెర్జెంట్(బట్టల) సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పినట్లు తెలిపారు. అందులో తయారు చేసిన సబ్బులను ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలకు జీసీసీ ద్వారా సరఫరా చేసినట్లు వెల్లడించారు. సబ్బులు ఎగుమతి చేసి మూడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేవారు. ఇచ్చోడ జీసీసీ సొసైటీ నుంచి రూ.2.12 లక్షలు, కామారెడ్డి నుంచి రూ.5.52లక్షలు, దమ్మపేట నుంచి రూ.2.67లక్షలు, పాల్వంచ నుంచి రూ. 2.46 లక్షలు, ఇల్లందు నుంచి రూ. 2.40 లక్షలు, ఏటూరునాగారం నుంచి రూ.3.99 లక్షలు, నర్సంపేట నుంచి రూ.5.20 లక్షలు, ములుగు నుంచి రూ.3.61లక్షలు, వెంకటాపురం(కె) నుంచి రూ.1.23 లక్షలు, మన్ననూరు జీసీసీ నుంచి రూ.2.99 లక్షలు సబ్బుల డబ్బులు పరిశ్రమకు రావాల్సి ఉందని తెలిపారు. 10 జీసీసీ కేంద్రాల నుంచి రావాల్సిన రూ.32 లక్షలు బకాయిలు ఇప్పించాలని అనేకమార్లు ఐటీడీఏ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించి పరిశ్రమను, గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు.
బకాయి బిల్లులు చెల్లించాలని
సబ్బుల పరిశ్రమ సభ్యుల వేడుకోలు


