ములుగు: మున్సిపాలిటీలో ఇంటి, వాణిజ్య పన్నులు భారీగా పెంచడంపై అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మున్సిపల్ కమిషనర్‌తో మూడు గంటల పాటు ముఖాముఖి చర్చించారు. గతంలో ఉన్న పన్నులపై 10 నుంచి 100 శాతం వరకు పెంపు చేసినట్లు ఆరోపించారు. పన్నులను 15 శాతానికి మించకుండా తగ్గించాలన్నారు. లేనిపక్షంలో మరో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జియో మ్యాపింగ్ పేరుతో ఇళ్ల కొలతల్లో తప్పులు చూపుతూ పన్నులు తగ్గించేందుకు ఔట్సోర్సింగ్ సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని 9వ వార్డుకు చెందిన వక్కల రమేశ్ సాక్ష్యాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిస్తానని కమిషనర్ హామీనిచ్చారు. కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేసి పన్నుల తగ్గింపుపై తీర్మానం చేస్తామని కమిషనర్ హామీనిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులతో పాటు వ్యాపార, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


