సోలార్‌ సేవల వారధి.. | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ సేవల వారధి..

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

లాభాలేంటంటే..

నేటి నుంచి పీఎం సూర్యఘర్‌పై అవగాహన సదస్సులు

● సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా టీజీఎన్పీడీసీఎల్‌

● ఒకే వేదికపై డిస్కం, రెడ్‌కో, బ్యాంకర్లు

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 203.10 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి

హన్మకొండ: సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ముందుకు సాగుతోంది. అక్టోబర్‌ 1, 2, 3 తేదీల్లో ప్రతీ విద్యుత్‌ డివిజన్‌ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఉమ్మడి జిల్లాలోని ఆరు సర్కిళ్లలోని 13 డివిజన్లలో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. హనుమకొండ సర్కిల్‌లో హనుమకొండ టౌన్‌, హనుమకొండ రూరల్‌ డివిజన్లు, వరంగల్‌ సర్కిల్‌లో వరంగల్‌టౌన్‌, నర్సంపేట, వరంగల్‌ రూరల్‌ డివిజన్లు. జనగామ సర్కిల్‌లో జనగామ టౌన్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ డివిజన్లు, మహబూబాబాద్‌ సర్కిల్‌లో మహబూబాబాద్‌, తొర్రూరు డివిజన్‌, భూపాలపల్లి సర్కిల్‌లో భూపాలపల్లి, కాటారం డివిజన్లు, ములుగు సర్కిల్‌లో ములుగు, ఏటూరునాగారం డివిజన్లు ఉన్నాయి.

అవగాహన కల్పిస్తారిలా..

‘సేవా సేతు’ కార్యక్రమంలో భాగంగా నేటి (గురువారం) నుంచి డివిజన్‌ స్థాయిలో పీఎం సూర్య ఘర్‌ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. అధికారుల సూచనలతో పాటు బ్యాంకు రుణాల జారీ, వినియోగంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారు. ఈమేరకు ఒకే వేదికపై టీజీ ఎన్పీడీసీఎల్‌, రెడ్‌కో అధికారులతో పాటు బ్యాంకర్లు పాల్గొననున్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆసక్తి కలిగిన వినియోగదారులకు అప్పటికప్పుడు రుణ మంజూరుతో పాటు అధికారులు.. అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. దీంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలనుకునే గృహ వినియోగదారులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఒకే చోట అన్ని పనులు పూర్తి కానున్నాయి. కాగా, పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజనపై టీజీ ఎన్పీడీసీఎల్‌ ఐపీసీ, రాక్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కె.వెంకటరమణ బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని కార్యాలయంనుంచి ఎస్‌ఈలు, డివిజన్‌ ఇంజనీర్‌లకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

పూర్తి సమాచారం ఒకేచోట..

రూప్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పా టు చేసుకోవడంపై వినియోగదారులకు ఒకే వేదికపై పూర్తి సమాచారం అందిస్తాం. సేవా సే తు కార్యక్రమాల్లో వినియోగదారులకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుకు సంబంధించిన విధానం, దరఖాస్తు ప్రక్రియ, సబ్సిడీ, బ్యాంకు రుణ సదుపాయాలు, నెట్‌ మీటరింగ్‌, విద్యుత్‌ బిల్లులో కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పిస్తారు. విద్యుత్‌ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– కె.వెంకటరమణ,

టీజీ ఎన్పీడీసీఎల్‌ ఐసీసీ–రాక్‌ చీఫ్‌ ఇంజనీర్‌

పీఎం సూర్య ఘర్‌–ముఫ్త్‌ బిజ్లీ యోజన ద్వారా తమ ఇళ్ల పైకప్పులపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు.

ఈపథకం కింద గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఒక కిలోవాట్‌కు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లకు ఆపైన కిలోవాట్ల సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000 కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది.

రూఫ్‌టాప్‌ సోలార్‌ ద్వారా విద్యు త్‌ బిల్లును తగ్గించుకునే అవకాశంతో పాటు మిగులు విద్యుత్‌ను ఉత్పత్తిని గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు

పీఎం సూర్య ఘర్‌ పథకం ద్వారా 3 కిలోవాట్లకు దాదాపు నెలకు 450 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకొనే అవకాశంఉంది.

టిజీఎన్పీడీసీఎల్‌ పరిధిలో ప్రస్తుతం 34,023 విద్యుత్‌ సర్వీస్‌ (వినియోగదారుల రూప్‌టాప్‌ సోలార్‌)ల ద్వారా 203.1 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 20,000 దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయి.

నేటినుంచి

అవగాహన సదస్సులు

ములుగు: పీఎం సూర్యఘర్‌ యోజనపై నేటి నుంచి 3వ తేదీ వరకు ములుగు డివిజన్‌ కార్యాలయంలో అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ బి.భిక్షపతి, టీజీ రెడ్కో జిల్లా మేనేజర్‌ రాజేందర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రదర్శన, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భిక్షపతి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement