ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యంలో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వాటి సంఖ్యను అంచనా వేసేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో మొత్తం 160 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పులులు, చిరుతలు వంటి మాంసాహార జంతువుల ఉనికి, సంచార ప్రాంతాలు, కదలికలను నమోదు చేసేందుకు వ్యూహాత్మక ప్రాంతాలను ఎంపిక చేసి అటవీశాఖ అధికారులు కెమెరాలను అమర్చుతున్నారు.
తాడ్వాయి అడవుల్లో ..
తాడ్వాయి వైల్డ్‌లైఫ్ అధికారులు అటవీ ప్రాంతంలోని 22 బీట్ల పరిధిలో 44 లొకేషన్లను గుర్తించారు. ఈ మేరకు తాడ్వాయి అడవుల్లో 88 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అభయారణ్యంలోని మిగిలిన ఆయా ప్రాంతాల్లో మిగితా 72 కెమెరాలను బిగించే పనుల్లో నిమగ్నం అయ్యారు. వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే అటవీ మార్గాలు, తాగునీటి వనరులు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని కెమెరాలను అమర్చుతున్నారు. జంతువుల సహజ సంచారానికి ఇబ్బంది కలగకుండా చెట్లకు కెమెరాలను అమర్చి వాటి కదలికలను రికార్డు చేయనున్నారు.
జంతువుల సంచారంపై ఆరా..
ట్రాప్ కెమెరాల ద్వారా ప్రధానంగా మాంసాహార జంతువుల కదలికలను గుర్తించనున్నారు. పులులు, చిరుతలు తదితర జంతువులు సంచరించే అవకాశం ఉన్న తాగునీటి ప్రాంతాలతో పాటు దారులు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. జంతువులు కెమెరాల ముందు నుంచి వెళ్లినప్పుడు వాటి చిత్రాలు ఆటోమేటిక్‌గా రికార్డవుతాయి. ఈ చిత్రాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఏయే జంతువులు సంచరిస్తున్నాయి, వాటి కదలికలు ఎలా ఉన్నాయనే వివరాలను అటవీశాఖ అధికారులు నమోదు చేయనున్నారు.
వారానికోసారి పరిశీలన
అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను సిబ్బంది క్రమం తప్పకుండా పరిశీలించనున్నారు. వారానికి ఒకసారి ఆయా ప్రాంతాలకు వెళ్లి కెమెరాల్లో నమోదైన చిత్రాలను సేకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటిని పరిశీలించి జంతువుల కదలికలను గుర్తించే పనుల్లో నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా పులులు, చిరుతలు వంటి మాంసాహార జంతువుల ఉనికిని నమోదు చేసేందుకు కెమెరా ట్రాపింగ్ కీలకంగా మారనుంది.
నాలుగేళ్లకోసారి టైగర్ ఎస్టిమేషన్
పులుల సంఖ్యను అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో పులుల సంఖ్యతో పాటు వాటి ఆవాస పరిస్థితులను అంచనా వేయడం, వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సమాచారాన్ని సేకరించడం దీని ప్రధాన ఉద్దేశం.
ఏటూరునాగారం అభయారణ్యంలో
వన్యప్రాణుల గణన
160 ట్రాప్ కెమెరాల ఏర్పాటుకు
అధికారుల చర్యలు
మాంసాహార జంతువుల
కదలికలపై ప్రత్యేక నిఘా


