● డీఎస్పీ రవీందర్
వెంకటాపురం(ఎం): యువతీయువకులు మత్తుకు బానిస కావొద్దని ములుగు డీఎస్పీ రవీందర్ అన్నారు. మండల పరిధిలోని జవహర్ నగర్ విలేజ్ కస్తూర్బా బాలికల పాఠశాలలో బుధవారం సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ రవీందర్ హాజరై మాట్లాడారు. సైబర్ మోసాల పట్ల పిల్లలందరికీ అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా డ్రగ్స్ పరిణామాలు, పొక్సో చట్టంపైన తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న తనం నుంచి క్రమశిక్షణ, చదువుపై ఏకాగ్రత, తల్లిదండ్రులు, సమాజం పట్ల గౌరవం పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ వాటర్ బాటిల్స్ అందజేశారు.


