న్యూస్‌రీల్
ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.
● మంత్రి సీతక్క చొరవతో కేటాయింపు
● మారనున్న గ్రామాల రూపురేఖలు
● తీరనున్న గిరిజనుల కష్టాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనుల కోసం ఎదురుచూస్తున్న మారుమూల గ్రామాల ప్రజలకు ఊరట కలగనుంది. జిల్లాలోని ములుగు నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.32.218 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామాల రోడ్ల అనుసంధానం చేయడంతో రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో జిల్లాలోని పలు గ్రామాల రహదారులు గుంతలు, బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో నిధుల మంజూరుతో ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది. రాష్ట్ర మంత్రి సీతక్క కృషితో గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు ప్రభుత్వం పెద్దపీఠ వేసిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ల నిర్మాణంతో ప్రయోజనం
కొత్త రోడ్ల నిర్మాణంతో ప్రజలతోపాటు ప్రధానంగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు సౌకర్యం మెరుగుపడనుంది. వర్షాకాలంలో రహదారులు బురదమయంగా మారడం వల్ల తరగతులకు హాజరు కావడంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి. అదే విధంగా అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు గ్రామాలకు సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. రైతులు, గిరిజన కుటుంబాలకు రోడ్ల అభివృద్ధి మరింత ప్రయోజనకరంగా మారనుంది. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర సామగ్రిని గ్రామాలకు తీసుకురావడం సులభం కానుంది. నిత్యావసర సరుకులు కూడా మారుమూ ల ప్రాంతాలకు సకాలంలో చేరే అవకాశం ఉంటుంది. రోడ్లతోపాటు డ్రెయినేజీల నిర్మాణంతో గ్రామాలు మెరుగుపడి అభివృద్ధికి బాటలు పడనున్నాయి. మండల, జిల్లా కేంద్రాలకు రాకపోకలు సులభం కావడంతో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, వ్యాపార రంగాల్లో మార్పులతో జిల్లా అభివృద్ధిలో మరింత వేగం పెంచే అవకాశం ఉంటుంది. రహదారి సౌకర్యం మెరుగుపడితే గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉంది. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రెయినేజీ పనులను త్వరగా చేపట్టి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసి పనులు పూర్తిచేస్తే గిరిజన గ్రామాల్లో ప్రజల రాకపోకలకు ప్రయోజనం చేకూరనుంది.
మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 95500 66739


