ఏటూరునాగారం: అటవీ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సమకూర్చిన రూ.15 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో మండలంలోని మామిడిగూడెంలో ఏర్పా టు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కొమరం భీమ్‌నగర్ కాలనీలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.5 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లోనూ విద్యకు ఆటంకం కలగకుండా కంటైనర్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గొత్తికోయ ఆదివాసీ మామిడిగూడెంలో పరిమిత సౌకర్యాల మధ్య విద్యార్థులు ప్రదర్శి స్తున్న ప్రతిభ అభినందనీయమన్నారు. పట్టణ ప్రాంతాల విద్యార్థులకు దీటుగా గిరిజన చిన్నారులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు ఇర్ప మధు, సారంగం సేవలను మంత్రి అభినందించారు. జిల్లాలో విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, సంబంధిత అధికారుల కృషిని మంత్రి సీతక్క అభినందించారు.
మామిడిగూడెంలో బోరు మంజూరు
మామిడిగూడెంలో త్వరలో తాగునీటి సదుపాయంతోపాటు సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతికి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు విద్యార్థులతో మంత్రి ముఖాముఖిగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్‌తో కలిసి విద్యార్థులకు యూనిఫారం, బూట్లు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు. కార్యక్రమాల్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీ మనన్ భట్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, ఉల్లాస్ సమన్వయకర్త కృష్ణబాబు పాల్గొన్నారు.
గ్రామసభల ప్రణాళికతో అభివృద్ధి పనులు
మంగపేట : గ్రామాపంచాయతీల అభివృద్ధి కోసం గ్రామసభల తీర్మాననం మేరకు ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపట్టాలని మంత్రి సీతక్క గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో పంచాయతీ కార్యర్శులు, ప్రత్యేక అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఎన్నికలు నిలిచిపోయిన గ్రామ పంచాయతీలకు నిధులు జమచేసినట్లు తెలిపారు. అనంతరం 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీపీఓ వెంకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి, గుమ్మడి సోమయ్య, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రునాయక్, డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్ పాల్గొన్నారు.
వృద్ధుల సంక్షేమమే
లక్ష్యంగా కార్యక్రమాలు
ములుగు: వృద్ధుల సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలి పారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులతో వృద్ధుల ముఖాముఖి కార్యక్రమాలు, నాటి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు, యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే జిల్లా స్థాయి వయోవృద్ధుల దినోత్సవానికి వృద్ధులతోపాటు వారిని సంరక్షించే కుటుంబ సభ్యులు హాజరు కావాలని కోరారు. వృద్ధుల అవసరాలు, సమస్యలను గుర్తించి వారి సంక్షేమానికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రేమలత, వయోవృద్ధుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క


