హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండ ఐఓడీసీలో జరగనున్న ఈ స మావేశంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో చేపట్టాల్సిన నివారణ, ముందస్తు చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించనున్నారు. గ్రామ పంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ, ఇతర భవనాల నిర్మాణ పనుల పురోగతి, పూర్తి స్థితి, పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అధికారులు తమ శాఖల తాజా గణాంకాలు, పురోగతి నివేదికలు, పెండింగ్ పనుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరు కావాలని స్పెషల్ సీఎస్ దాన కిశోర్ ఆదేశించారు.
‘రెడ్‌క్రాస్’ నామినేషన్ల స్వీకరణ పూర్తి
ములుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నిర్వహణ కమిటీ ఎన్నికలకు గురువారం నామినేషన్ల స్వీకరణ పూర్తయిందని ఎన్నికల అధికారి ధర్మనాయక్ గురువారం తెలిపారు. సంక్షేమ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. గడువు ముగిసే సమయానికి మొత్తం 17 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు. నేడు(శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లను పరిశీలించి, సరైన నామినేషన్ల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. పోటీ అనివార్యమైతే అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, లెక్కింపు పూర్తయిన అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల అధికారి ధర్మ నాయక్ వెల్లడించారు.


