దోమలకు ఆవాసాలుగా ప్లాట్లు
ములుగు పట్టణాన్ని పీడిస్తున్న డ్రెయినేజీ సమస్య
● ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు
● ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు
● రామప్ప చెరువులో చేరుతున్న మురుగునీరు
● పైపులైన్ లీకేజీలతో తాగునీటి సమస్య
డ్రెయినేజీలో నిలిచిన మురుగునీరు
అంతర్గత రహదారులు ఆధ్వానం
పట్టణంలో అంతర్గత రహదారులు ఆధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంతలతో దర్శనమిస్తున్నాయి. కల్వర్టులు సైతం ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్న రహదారులు ఇరుకుగా ఉండడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని రహదారులు 15 ఫీట్లు ఉండడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేకపోతుండడంతో వాహనదారుల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంటుంది. విస్తరించేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులు కలిసి మరో 5 ఫీట్లు దారికి ఇవ్వాలని అడిగితే ససేమిరా ఇవ్వమని అంటుండడంతో అంతర్గత రోడ్ల విస్తరణ ఇబ్బందిగా మారింది.
మురుగునీరంతా రామప్ప చెరువులోకి..
పట్టణానికి చెందిన మురుగునీరంతా బండారుపల్లి చెరువు ద్వారా రామప్ప సరస్సులోకి వెళ్తోంది. పట్టణంలో డ్రెయినేజీ సిస్టం సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయి. వర్షపునీటితో మురుగునీరంతా రామప్ప చెరువులోకి వెళ్తుండడంతో రామప్ప సరస్సు నీరు కలుషితమవుతుంది. జిల్లాలోని 4 మండలాల పరిధిలో గల 175 శివారు గ్రామాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందిస్తున్న రామప్ప సరస్సులోకి ములుగు పట్టణం మురుగునీరంతా చేరి తాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రామప్ప సరస్సులోకి మురుగునీరు వెళ్లకుండా అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుసుకోవాల్సిన అవసరం ఉంది.
5,540 నల్లా కనెక్షన్లు
మున్సిపాలిటీ పరిధిలో చాలా కాలనీల్లో పైపులైన్ లీకేజీల కారణంగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు పట్టణంలో 14 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా 110కిలో మీటర్ల మేర పైపులైన్ విస్తీర్ణం ఉంది. 5,540 నల్లా కనెక్షన్లు ఉండగా నల్లానీరు సరిగా రావడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన పైపులైన్ కావడంతో తరచూ లీకేజీలు అవుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని పలుచోట్ల ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు చెత్తాచెదారం పడేస్తుండడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 20 వార్డుల పరిధిలో 17,580 మంది జనాభా 13,963 మంది ఓటర్లు ఉన్నారు. 1985లో పంచాయతీగా ఆవిర్భవించిన ములుగు 17 ఫిబ్రవరి 2019న జిల్లాగా ఏర్పాటైంది. ములుగు పట్టణాన్ని 5 ఏప్రిల్ 2025న మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గత ఎనిమిది నెలల క్రితం తొలిసారిగా ములుగు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గం ఏర్పాటైనా నిధుల కొరతతో సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.


