ములుగు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, అధికారులు బాధ్యతాయుతంగా సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో మంగళవారం భూ రీసర్వే, భూభారతి, తదితర రెవెన్యూ అంశాలపై ఐడీఓసీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీసర్వే పనులను ప్రణాళికతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తూ, కొలతలు, భూ వివరాల నమోదులో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రామచంద్రపురం గ్రామంలో రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించేందుకు రూపొందించిన పట్టా పాస్‌పుస్తకాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సంబంధిత రికార్డులు, రైతుల వివరాలను పరిశీలించి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. భూ భారతి, సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


