● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్
ములుగు: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అనేక హామీలిచ్చి అమలు చేయకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని, పేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చి అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి, మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల హామీలను సైతం బీఆర్‌ఎస్ నెరవేర్చలేదని ఆరోపించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అశోక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ చిటమట రఘు, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, రవాణా శాఖ స్టేట్ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


