● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావుల పిలుపు మేరకు కాంగ్రెస్ అసమర్థ పాలనను ఎండగడుతూ ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఆడబిడ్డలకు రూ.660 కోట్లు బాకీ ఉన్నారని, మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ములుగులోని 80 వేల మంది మహిళలకు రూ.660 కోట్లు బాకీ పడ్డారని వివరించారు. ఉచిత బస్సు పేరుతో వరంగల్, ములుగు, ఏటూరునాగారం, భద్రాచలం రూట్లలో బస్సులు తగ్గించి చార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. ఏజెన్సీలో పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే వారం రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గోవిందనాయక్, మల్లారెడ్డి, కృష్ణ, జంపన్న, మాజీ ఎంపీపీ వినయ్ కుమార్, మల్కా రమేశ్, తాడూరి రఘు, డయ్య అశోక్, రమేష్ రెడ్డి, రమణారెడ్డి, నరసింహ నాయక్, విజయ్, ఎండి ఖాజా పాషా పాల్గొన్నారు.


