● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు: అర్హులైన పేదలందరికీ స్మార్ట్ రేషన్‌కార్డులు అందుతాయని, వారి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క ములుగు, మల్లంపల్లి మండలాల లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. ములుగు మండలానికి 1,809, మల్లంపల్లి మండలానికి 621 స్మార్ట్ రేషన్‌కార్డులు మంజూరు కాగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రేషన్ కార్డులు లేని కారణంగా అర్హులైన పేదలు సన్నబియ్యం పథకానికి దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నూతన కార్డులను మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ సంవత్సరంలో 12,802 మందికి నూతన రేషన్ కార్డుల ద్వారా 36,405 మంది కుటుంబ సభ్యులకు సన్నబియ్యం పథకం ప్రయోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం కొనుగోలు చేయడం పేద కుటుంబాలకు భారంగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందించడంతో ఆ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గిందన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పింఛన్ల దరఖాస్తుల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించినట్లు వెల్లడించారు. ములుగు నియోజకవర్గానికి ఇప్పటివరకు 5 వేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు. ఇంకా అనేక పేద కుటుంబాలకు ఇళ్ల అవసరం ఉందని తెలిపారు. సర్వేలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు ములుగులో అధికంగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. రెండో విడతలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్‌జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, డీసీఎస్‌ఓ ఫైజల్ హుస్సేని, డీఎం కృష్ణవేణి, తహసీల్దార్లు, ప్రజలు పాల్గొన్నారు.
భువన్ సర్వే పరిశీలన
ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న భువన్ సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జె.సంపత్ క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. సర్వే సిబ్బందితో మాట్లాడి పట్టణంలోని ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న భవనాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని బిల్ కలెక్టర్లు పరిశీలించాలన్నారు. అనుమతులు లేని నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే పట్టణంలోని వ్యాపార సంస్థలను సందర్శించి ట్రేడ్ లైస్సెన్స్ పరిశీలించారు. ప్రతీ వ్యాపారీకి తప్పనిసరిగా ఉండాలన్నారు. లేదంటే చర్యలు తప్పవన్నారు.


