భూపాలపల్లి: సైబర్ నేరాలు పెద్ద పట్టణాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరించాయని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత గౌరవ వందనం స్వీకరించి, డీపీఓలో కొత్తగా ఏర్పాటుచేసిన జిమ్‌ను ప్రారంభించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో డీజీపీ సరదాగా కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు. పోలీసు అధికారులు, సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. డీజీపీ కార్యాలయంలోనే బెటాలియన్ సిబ్బంది ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించిన డీజీపీ.. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలను లోతుగా విశ్లేషించి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు ఉద్యోగులు తమ రిటైర్మెంట్ అనంతరం వచ్చిన సొమ్మును కూడా సైబర్ మోసగాళ్ల చేతిలో కోల్పోతున్నారని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఆన్‌లైన్ గ్యాంగులు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ తెలిపారు. ఈ అంశంపై రెండు జిల్లాల ఎస్పీలతో లోతుగా చర్చించి, సమర్థవంతమైన చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రోడ్లపై అక్రమ పార్కింగ్, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాఫిక్, రోడ్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రజలు తీసుకుంటున్న ఆహారం నాణ్యతపై ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయన్నారు. కల్తీ ఆహార పదార్థాలపై నిఘా పెంచడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు, దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఈగల్ ఎస్పీ గిరిధర్, సీఎస్‌బీ ఎస్పీ సాయిశ్రీ, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎస్పీలు సిరిశెట్టి సంకీర్త్, సుధీర్ రాంనాథ్‌కేకన్, భూపాలపల్లి ఏఎస్పీ నరేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు
హైవే పెట్రోలింగ్ బలోపేతం
కల్తీ ఆహార విక్రయాలపై
కఠిన చర్యలు
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో
గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా
డీజీపీ సీవీ ఆనంద్


