కేయూ క్యాంపస్: మౌలిక వసతుల కల్పనకు కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉన్నరోజుల్లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి వచ్చిందని గుర్తుచేశారు. తొలి ఉపకులపతి వెంకట్రామయ్య అంకితభావం, కఠోరశ్రమ, ముందుచూపుతో కాకతీయ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారన్నారు. తర్వాత వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన జాఫర్‌నిజాం, వాసుదేవ్ తదితరులు అదేస్ఫూర్తిని కొనసాగించారని వివరించారు. దివంగత వీసీ ఎన్.లింగమూర్తి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు. గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం10 గంటలకు కుర్తా ఆధ్వర్యంలో పరిపాలన భవనంలోని సెనేట్‌హాల్‌లో విశ్రాంత ఆచార్యుల సమావేశం (మీట్) ను నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీలో 204 మంది విశ్రాంత అధ్యాపకులు ఉన్నారని, 70 ఏళ్లపైబడిన విశ్రాంత అధ్యాపకులను కేయూ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల మీట్‌లో సన్మానించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, కోశాధికారి జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ికుర్తా కార్యవర్గసభ్యులు ప్రొఫెసర్లు సీహెచ్ సమ్మయ్య, సుధాకర్ తదితరులుపాల్గొన్నారు.
న్యాయ వ్యవస్థపై
నమ్మకంతో పోరాడుతున్నాం
కాశిబుగ్గ: న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అదే నమ్మకంతోనే కార్మికుల పక్షాన పోరాడుతున్నామని ఆజంజాహి మిల్స్ వీఆర్‌ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఆదివారం వరంగల్ చింతల్ బ్రిడ్జి వద్ద వీఆర్‌ఎస్ అసోసియేషన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేశ్ మాట్లాడుతూ.. 134 మంది మిల్లు కార్మికులకు 200 గజాల చొప్పున ఇచ్చినట్లుగానే మిగతా 318 మందికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పాండవుల సమ్మయ్య, తౌటం రమేశ్, సంజీవ్ పాల్గొన్నారు.
భక్తులకు
ఇబ్బందులు కలగొద్దు
కాళేశ్వరం: ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న శ్రావణమాసంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నెలరోజుల పాటు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నట్లు కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్‌శర్మ, ఈఓ మహేశ్ తెలిపారు. ఆదివారం కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో చైర్మన్, ఈఓ, ధర్మకర్తలు, ఎక్స్‌అఫీ షియో సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. పూజలు, భక్తుల రద్దీ, ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.


